Monday, September 17, 2012

సుత్తివేలుకి నివాళి



మనకి బాగా ఇష్టమయిన హాస్య నటుడు సుత్తివేలు గారు ఆదివారం ఉదయం (సెప్టెంబరు 16న) తుది శ్వాస విడిచారు. సుత్తివేలుగారి అసలు పేరు కురుమద్దాలి లక్ష్మి నరసిమ్హా రావు అట, నాకు ఇపుడే తెలిసింది. ఈమధ్య కాలంలో ఆయన సినిమాలలో తక్కువ చేస్తున్నారు, టీవీ సీరియల్సులో ఎక్కువ చేస్తున్నారట. ఆయన వయస్సు 65 సంవత్సరాలు, అంటే తక్కువ వయసే అని చెప్పుకోవచ్చు. కొంత కాలంగా అనారోగ్యానికి గురి అయ్యి చికిత్స పొందుతూ ఉన్నారని మీడియా చెప్పింది. సుత్తివేలు గారి ఆత్మకి శాంతి కలగాలని ఆశిస్తూ ఆయన జ్ఞాపకాలని ఒకసారి నెమరు వేసుకుందాం రండి.

సుత్తివేలుగారి మొదటి సినిమా ముద్దమందారం. ఆయన రెండవ సినిమా నాలుగు స్తంభాలాట వేలుగారికి బాగా పేరు తీసుకువచ్చింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి సుత్తి జంటని పరిచయం చేసారు జంధ్యాల గారు. సుత్తి వేసేవారుగా సుత్తి వీరభద్ర రావు, సుత్తి వేయించుకునే పాత్రలో వేలు గారు మనల్నందరినీ విపరీతంగా నవ్వుల్లో ముంచెత్తారు. తెర మీద మొదటిసారి వీరి నటన చూసి సినిమాహాలంతా నవ్వులతో నిండిపోయింది.

అసలు సుత్తి ఎలా , ఎక్కడ మొదలయింది? దానిలో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ వీడియో చూడండి.

అలా మొదలయిన సుత్తి ఈనాటికీ మనం వాడుతూ ఉన్నామంటే ఆ ఖ్యాతి మన జంధ్యాల గారిదీ, సుత్తి జంట గారిదీ! స్కూలులో టీచర్లనీ, కాలేజీలలో లెక్చరర్లనీ, బంధువులనీ ఒక సుత్తి కోవలో చేర్చి ఆట పట్టించడం ఆరోజుల్లో చాలా సాధారణమయి పోయింది. జంధ్యాల గారి దర్శకత్వంలో ఈ జంట చాలా సినిమాలనే చేసారు. చంటబ్బాయి సినిమాలో డిటెక్టివ్ దగ్గర పని చేసే అసిస్టెంటుగా వేలు గారు చాలా బాగా నవ్విస్తారు. ఆదిత్య 369 సినిమాలో పోలీస్ కానిస్టేబిల్ వేషములో టైం మెషీనుతో చేసే యాత్రలు భలే ఉంటాయి.
 
సుత్తివేలు గారు హాస్య రసాన్నే కాకుండా టీ.కృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన రేపటి పౌరులు, ప్రతిఘటన, వందేమాతరం ఓ కొత్తగా కనిపించారు. ప్రతిఘటన సినిమాలో సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబిల్ పాత్రలో వేలుగారి నటన అద్భుతం. వందేమాతరం సినిమాలో వేలుగారి నటనకి రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది బహుమతి లభించింది. తెలుగు సినీ ప్రేక్షకులకి మరొక తీపి గుర్తుగా సుత్తివేలు గారు మిగిలిపోయారు.

No comments: