Thursday, September 8, 2011

నేనీదరినీ, నువ్వాదరినీ... కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...




రెక్కలొచ్చి గూట్లోంచి ఎగిరి ఎవరి దారిలో వాళ్ళు నడుస్తూ, పెరిగెత్తుతూ, ఎగురుతూ ఉన్న జీవితాల్లో ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు కొత్త అందాన్ని,ఆనందాన్ని తీసుకువచ్చాయి. కాలేజీ వదిలాక స్నేహితులంతా చెల్లాచెదురయినా మళ్ళీ ఇన్నాళ్ళకి ఫేస్ బుక్ పుణ్యమా అని మళ్ళీ కలిసాం. అలాగే చెట్టా, పట్టలేసుకుని ప్రేమికులులా తిరిగిన నేను, నా డాళింగ్ ట్విట్టర్ ద్వారా మళ్ళీ కలిసాం. జారి పోతున్న చెడ్డీని పైకి లాక్కున్న స్కూలు రోజుల్లో స్నేహితులని కూడా ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు కలిపేస్తున్నాయి.  స్నేహితులే కాకుండా బంధువర్గాన్ని కూడా సాదరంగా ఈ సోషల్ నెట్ వర్కింగ్ లో ఆహ్వానించుకోవచ్చు. 


పాత స్నేహితులు కలవడం ఒక ఎత్తయితే మన అభిరుచుల ద్వారా కొత్త స్నేహితులని కలుపుకుంటూ పోవడం ఇంకొక ఎత్తు. తెలుగు బ్లాగర్లు చాలా మందిని మనం ఇక్కడ కలవచ్చు. అలాగే కవులు, రచయితలు, జర్నలిస్టులు, క్రీడాకారులు, ఆఫీసులో కొలీగులు ఇలా అందరినీ కలుపుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే వీటి ద్వారా సెలెబ్రైటీస్ కూడా తమ అభిమానులని ఇక్కడ వెంట తిప్పుకోవచ్చు.



బ్లాగర్లకి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు చాలా బాగా పనికొస్తాయి. ఇంతకు ముందు మన బ్లాగుని కూడలిలో పబ్లిష్ చేసుకునేవాళ్ళం. ఇపుడు ఫేస్ బుక్కులో, గూగుల్ ప్లస్సులో, ట్విట్టరులో వేసుకుని మన మిత్రులతో, శ్రేయోభిలాషులతో పంచుకోవడానికి అవకాశం ఉంది. మన బ్లాగు చదివి కామెంటిన అభిమానులతో ప్రత్యక్షంగా మాట్లాడుకోవచ్చు.తన శ్రేయోభిలాషులని కలవడానికి జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రలా ఈ సోషల్ సైట్లలో మన ప్రయాణం సాగుతుంది. 

ఇంచుమించు 750 మిలియన్ల మంది ఇపుడు ఫేస్ బుక్ వాడుతున్నారట. మొన్న మార్చిలో జపానులో జరిగిన భూకంపం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆరోజు 177 మిలియన్ ట్వీట్స్ జరిగాయట,తెలుసా! ఈమధ్యనే గూగుల్ వాడు మొదలుపెట్టిన గూగుల్ ప్లస్ ఇన్విటేషన్స్ కోసం పెద్ద హల్ చల్ జరిగింది. లేటుగా వచ్చినా గూగుల్ లో కూడా ఇప్పటికీ 25 మిలియన్ల సభ్యులు ఉన్నారట.

ఇపుడు కొత్తగా వస్తున్న కొన్ని మొబైల్ ఫోన్లలో ఫేస్ బుక్ బటన్ కూడా ఉందట. బటన్ నొక్కి నేరుగా ఫోటోలు అప్ లోడ్ చేసుకోవచ్చట. టాబ్లెట్లలో కూడా మీరు సోషల్ సైట్లకు వెళ్ళచ్చు, రండి, మావి కొనుక్కోండి! అని టాబ్లెట్ల మార్కెటింగ్ జోరు కూడా బాగా పెరిగింది. ఆమధ్య ఒక శనివారం రాత్రి క్లబ్బుకి వెళ్తే అక్కడ పని చేసే అమ్మాయి ఐ-పాడ్ చేతికి తగిలించుకుని తిరుగుతూ ఉంది. ఏమి చేస్తుందో తెలుసుకుందామని చూస్తే, ఆ అమ్మాయి అందరి దగ్గరకి వెళ్ళి, వాళ్ళని క్లబ్ ఫేస్ బుక్ పేజికి తగిలిస్తూ ఉంది! 

సెల్ ఫోన్లు వచ్చాక పక్కన కూర్చున్న మనుషులతో మాట్లాడడం తగ్గించాం. ఇపుడు ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ మన చుట్టుపక్కల వాళ్ళని మర్చిపోతున్నాం. మరీ ఎప్పుడూ కాకపోయినా అపుడపుడూ అయినా మానవమాత్రులతో మాట్లాడి మన సంబంధాలని బలపరుచుకుందాం, ఏమంటారు? 

4 comments:

రసజ్ఞ said...

బాగుందండీ శ్రీ గారు! ఏదయినా ఇటువంటివన్నీ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడాను. అందుకనే నా బ్లాగులో నేను ఈ ముఖపుస్తకం (facebook ) గురించి వేరే కోణములో రాయడం జరిగింది.

శ్రీ said...

థాంక్స్ రసజ్ఞ గారు. మీ టపా కూడా ఇపుడే చదివాను, బాగుంది. వేరే కోణంలో చెప్పారు.

Rajendra Devarapalli said...

మన సంబంధాలని బలపరుచుకుందాం

శ్రీ said...

తప్పకుండా రాజేంద్ర గారు.