Wednesday, June 29, 2011

సలాం బాంబే - మురికివాడల్లో పిల్లల బతుకు పోరాటం




ఈ సినిమా దర్శకురాలు మీరానాయర్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. నాకు తెలిసి నేను ఈమె సినిమాలు మాన్సూన్ వెడ్డింగ్ నుండి చూస్తూ ఉన్నా. ఆ సినిమా నచ్చి ఇక ఆమె మిగతా సినిమాలు చూడడం మొదలుపెట్టాను అప్పట్లో. ఆ సమయంలో చూసిన కొన్ని సినిమాలల్లో సలాం బాంబే ఒకటి. మళ్ళీ ఈరోజు వద్దనుకుంటూనే ఈ సినిమా చూసాను. ఎందుకు చూడకూడదనుకున్నానంటే సినిమా నచ్చక కాదు. సినిమాలో ఉన్న నిజాలని, బాంబే మురికివాడల్లో అనాధ పిల్లల జీవనపోరాటం బాధాకరంగా, నిష్టూరంగా ఉంటాయి.


ఇక కథలోకొస్తే కృష్ణ (షఫి) చిన్నపుడు ఇంటి నుండి పారిపోయి బొంబాయ్ చేరుకుంటాడు. ఎప్పటికయిన అయిదువందలు సంపాదించి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళాలని టీ అమ్ముకుంటూ ఉంటాడు. షఫి లాగే ఇంకా కొంత మంది పిల్లలు చిన్నా, చితకా పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళంతా ఎండకి ఎండి, వానకి తడుస్తూ రోడ్డు పక్కనే పడుకుని రోజులు గడుపుతూ ఉంటారు. షఫికి చిల్లం, మంజు స్నేహితులు. చిల్లం బాబా అనే బ్రోకర్ దగ్గర పని చేస్తూ గంజాయి లాంటివి అమ్ముకుంటూ, తాగుతూ ఉంటాడు. మంజు బాబా కూతురు. మంజు అమ్మ రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. 


బాబాతో గొడవొచ్చి చిల్లం ఉద్యోగం పోగొట్టుకుంటాడు. గంజాయి తాగడానికి అలవాటు పడ్డ చిల్లం అనారోగ్యానికి గురై చనిపోతాడు. ఈమధ్యలో ఒక అమ్మాయిని (పదహారేళ్ళ పాప) ఎవడో మోసం చేసి వేశ్యా గృహంలో అమ్మేస్తాడు. పదహారేళ్ళ పాప కూడా బాబా మాటలు విని అతని మత్తులో పడిపోతుంది. షఫి, మంజుని పోలీసులు పట్టుకుని బాల నేరస్థుల కారాగారంలో పడేస్తారు. మంజు ఇంటి పరిస్థితి చూసి కోర్టు ఆ పిల్లని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని చదివించాలనుకుంటుంది. షఫి ఎలాగో తప్పించుకుని బయటపడుతాడు. షఫి డబ్బులు సంపాదించి ఇంటికి వెళ్తాడా? అతని కల నిజమవుతుందా?  


ఈ సినిమాలో నటించిన పిల్లలందరూ నిజంగా మురికి వాడల్లో పెరుగుతున్న పిల్లలే అట. సినిమాలో నటించే ముందు వాళ్ళందరికీ నటన నేర్పించి వాళ్ళ చేత వాళ్ళ జీవితం జీవించేలా చేసారు. షఫి, మంజు ఇద్దరూ చాలా అద్భుతంగా నటిస్తారు. ఏమో, వాళ్ళకి నటన తెలియదేమో, వాళ్ళ నిజ జీవితం మనం చూస్తున్నామేమో అని మనకి అనిపిస్తుంది. పిల్లలందరూ రూప్ కి రాణీ, చోరోం కా రాజా' సినిమాకెళ్ళి చేసే గలభా చాలా సహజంగా ఉంటుంది. 


నాకు నచ్చిన సీన్
సోలా సాల్ ని కాపాడాలనుకుని ఆ అమ్మాయి దగ్గరకి షఫి వచ్చి 'నేను మా వూరెళ్తున్నాను, నిన్ను తీసుకు పోతాను. నాతో వస్తావా?' అని అడిగినపుడు సోలా సాల్ దిండు కింద నుండి ఒక ఫోటో తీసి షఫికి ఇస్తుంది. ఆ ఫోటోలో సోలా సాల్, బాబా ఉంటారు. బాబా మీద మనసుపడ్డ ఆ అమాయకురాలి మొహంలోకి షఫి కాసేపు అలాగే జాలిగా చూస్తాడు. ఈ సీన్ చాలా బాగా ఉంటుంది.


ఇక చిల్లం గా నటించిన రఘువీర్ యాదవ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నపుడు ముంగేరీలాల్ కీ హసీన్ సప్నే అని దూరదర్శన్లో ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ని నేను బాగా రెగులర్ గా చూసేవాడిని. చిల్లం నటన ఈ సినిమాలో నిజంగా ఒక అద్భుతం. డబ్బులు లేక షఫిని, బాబాని అడిగే సన్నివేశం బాగా కదిలించేదిగా ఉంటుంది. ఇక చిల్లం చనిపోయినపుడు కూడా పిల్లలందరూ అతని అంతిమక్రియలు జరపే సన్నివేశం కూడా చాలా బాగుంటుంది.  నానా పాటేకర్ గురించి చెప్పక్కరలేదు, ఎప్పటిలాగే చాలా బాగా నటించాడు. ఈ సినిమా నుండి ఇతనికి మంచి పేరొచ్చింది. దీని తర్వాత నటించిన పరిందాతో కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాడు. 


ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఒకటి ఉత్తమ బాల నటుడు, రెండోది ఉత్తమ ప్రాతీయ భాషా చలనచిత్రం.  ఈ సినిమా తర్వాత బొంబాయిలోని మురికివాడల్లో నివసించే పిల్లల కోసం మీరానాయర్ 'సలాం బాలక్ ట్రస్ట్' ఒకటి స్థాపించింది. ఈ ట్రస్ట్ ఇప్పటికీ బొంబాయ్,ఢిల్లీ ఇంకా భువనేశ్వర్ నగరాలకి వ్యాపించింది. కృష్ణగా నటించిన షఫి ఈ ట్రస్ట్ ద్వారా ఇపుడు బెంగళూరులో ఆటో డ్రైవరుగా జీవిస్తున్నాడు.